ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వారందరికీ తప్పనిసరిగా పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిహారంపై సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు అందిన సాయం, లబ్ధిదారుల సమస్యలు, ఫిర్యాదుల గురించి అధికారులు ఆయనకు వివరించారు.
రూ.602 కోట్ల పరిహారం పంపిణీకి గాను రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రైతులకు పంట నష్టపరిహారం కింద జరిపే చెల్లింపులు రూ.301 కోట్లు. షాపులు మునిగిన ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా మిగిలిన మొత్తాన్ని అందజేస్తామని చెప్పారు.
బాధితుల అకౌంట్లకు నగదు డీబీటీ పద్ధతిలో అందించామని, 97 శాతం మందికి పరిహారం జమ అయ్యిందని అధికారులు వివరించారు. అయితే సాంకేతిక సమస్యల వల్ల 22,185 మంది లబ్ధిదారులకు నగదు జమ కాలేదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేయాలని ఆదేశించారు.
ఇప్పటికీ కొంత మంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వాటిని పరిశీలించి అర్హత ఉంటే సాయం అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. అర్హులుగా ఎంపికై ఎవరికైతే డబ్బులు వారి అకౌంట్లలో పడలేదో…వారు సచివాలయ సిబ్బంది ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కోరుతున్నామని అధికారులు తెలిపారు.
వచ్చే శుక్రవారం నాటికి సాంకేతిక సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.