గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం: పవన్ కల్యాణ్

గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వరుసగా బయటపెడుతున్నారు. ఈ మధ్య రేషన్ బియ్యం ఘటన తర్వాత ఇప్పుడు తాజాగా జల్ జీవన్ మిషన్లోని అక్రమాలపై పవన్ విరుచుకుపడ్డారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో పవన్ మాట్లాడారు.

జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని పవన్ తెలిపారు. నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని, ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమయిందని చెప్పారు. ప్రతి మనిషికి రోజుకు సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు.