Atpnews: టమోటా రైతులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్

టమోటా రైతులను ఆదుకోవాలి, మార్కెట్ లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డికి అనంతపురం సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 23 వేల హెక్టార్లలో టమోటా పంట సాగు చేస్తున్నారు. పండించిన పంటను రైతులు అనంతపురం నగరానికి సమీపంలో ఉన్న కక్కలపల్లి మార్కెట్, మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో అమ్మకాలు జరుపుకుంటున్నారు. గత రెండు మూడు రోజులుగా కక్కలపల్లి మార్కెట్ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మండీ వారు వసూళ్లు చేస్తున్న పది శాతం కమీషన్, అసోసియేషన్ పేరిట లారీల నుండి చేస్తున్న భారం తమపై పడుతుందని, బయటి నుండి వ్యాపారులను, లారీలను రానివ్వడం లేదని రైతులు చెబుతున్నారు. వీటిపై తమరు జోక్యం చేసుకుని సమగ్రంగా విచారణ జరిపించి పరిష్కరించాలని కోరారు.
జిల్లాలో ఉన్న టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ క్రిందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వమే టమోటా మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ. నల్లప్ప, ఎస్. నాగేంద్ర కుమార్, ఎం. బాల రంగయ్య, ఆర్ వి నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.