అటవీ భూమి ఆక్రమించిన పెద్దిరెడ్డిని బిగిస్తారా ? ద్వారంపూడిని వదిలేసినట్లు..,

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు అటవీశాఖ మంత్రిగా పదవి నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి … అటవీభూములకు ఎసరు పెట్టారు. వందల ఎకరాల భూముల రికార్డులు ఏమార్చి సొంత భూమిగా మార్చేచుకున్నారు .  ఇందులో ఇప్పటి వరకు సుమారు 80 ఎకరాల భూమి మాత్రం ట్యాపరింగ్ చేసినట్లు తేలింది .  అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందా ?

లేక గతంలో రేషన్ బియ్యం మాఫియాలో అడ్డంగా బుక్ అయినా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ,  జగన్ సన్నిహితుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వదిలేసినట్లు పెద్దిరెడ్డిని కూడా వదిలేస్తారా ?  అన్న చర్చ టీడీపీ, వైసీపీ వర్గాలలో జోరుగా సాగుతోంది .

పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ ,  రికార్డుల మార్పు పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ప్రభుత్వానికి తాజాగా నివేదిక ఇచ్చారు .  దీనిపై సర్కార్ ఏ చర్యలు తీసుకుంటుంది ?  ఈలోగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారా ?

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 29న పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు – ఈటీవీ భారత్ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. దానిపై అప్పట్లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ఆ భూములన్నీ తాను కాయకష్టం చేసి, చెమటోడ్చి సంపాదించుకున్నవి అన్నట్లుగా అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని నిగ్గుతేల్చారు. 295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకొన్నారని తేల్చారు. దాని చుట్టూ కంచె వేశారని నిర్ధారించారు.

పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్‌ల్యాండ్‌లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్టు విజిలెన్స్‌ బయటపెట్టింది. రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూములను కబ్జా చేసి పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు కూడా వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది.

 పెద్దిరెడ్డి మంగళంపేటలో అటవీ భూముల్ని ఆక్రమించుకున్న తీరును కీలకమైన  ఏడు ఆధారాలతో విజిలెన్స్‌ బయటపెట్టింది.

ఫెయిర్‌ అడంగల్, 10-1 అడంగల్, ఎఫ్‌ఎంబీ, గ్రామపటం, వెబ్‌ల్యాండ్‌ డిజిటల్‌ హిస్టరీ, ఆర్‌ఓఆర్, ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌లు, మ్యుటేషన్‌ హిస్టరీ, డ్రోన్‌ ఫొటోలు, గూగుల్‌ ఎర్త్‌ టైమ్‌లైన్‌ ఫొటోలను అధ్యయనం చేయడంతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో మొత్తం భూములను పరిశీలించారు. సర్వే నంబర్లలో 23.69 ఎకరాలున్న భూమి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలోకి వచ్చేసరికి 45.80 ఎకరాలకు, వెబ్‌ల్యాండ్‌లో 77.54 ఎకరాలకు, 10-1 అడంగల్‌లో 86.65 ఎకరాలకు, క్షేత్రస్థాయిలోకి వెళ్లేసరికి 104 ఎకరాలకు చేరినట్లు   గుర్తించారు.

ఫెయిర్‌ అడంగల్‌ ప్రకారం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని 295, 296 సర్వే నంబర్లలో తమకు 75.74 ఎకరాల భూమి ఉందని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ 1905 నుంచి 1920 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 295లో 17.69 ఎకరాలు, 296లో 6 ఎకరాలు కలిపి మొత్తం 23.69 ఎకరాలు మాత్రమే పట్టా భూమి ఉంది. అదీ మెట్ట భూమి.

పాకాల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌లలో 295, 296 సర్వే నంబర్లలో ఉన్నది 23.69 ఎకరాలు. కానీ పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 45.80 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌లు ఉన్నాయి. ఆ రెండు సర్వే నంబర్లను సబ్‌డివిజన్‌ చేసినట్టుగా చూపించి ఎక్కువ భూమి రిజిస్టర్‌ చేసుకున్నారు. దేశిరెడ్డి మంగమ్మ నుంచి పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి సర్వే నంబర్‌ 295/1ఏలో 15 ఎకరాలు కొన్నట్టు 2000 డిసెంబర్ 29న రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

దేశిరెడ్డి శ్రీరాములురెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1బీలో 10.80 ఎకరాలు కొన్నట్టు 2009 డిసెబర్ 29న రిజిస్ట్రేషన్‌ చేశారు. దేశిరెడ్డి చెంగారెడ్డి నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 295/1సీలో 10 ఎకరాలు కొన్నట్టు 2001 జనవరి 1న రిజిస్టర్ చేయించుకున్నారు. దేశిరెడ్డి సర్వేశ్వరరెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1డీలో 0.89 ఎకరాలు కొన్నట్టు 2001 జనవరి 1న సేల్‌డీడ్‌ జారీ అయింది. సర్వే నంబర్‌ 295లో 17.69 ఎకరాల భూమి ఉంటే ఏకంగా 36.69 ఎకరాల్ని పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకులు వేరే వ్యక్తుల నుంచి కొన్నట్టు చూపించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

 ఆ సర్వే నంబరులో ఉన్నదాని కంటే అదనంగా 19 ఎకరాల రిజిస్ట్రేషన్‌ జరిగింది. సర్వే నంబర్‌ 296లో ఉన్నదే ఆరు ఎకరాలైతే, దేశిరెడ్డి సర్వేశ్వరరెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 296/1లో 9.11 ఎకరాలు కొన్నట్లు 2001 జనవరి 1న రిజిస్ట్రేషన్‌ చేశారు. అక్కడున్న దానికంటే అదనంగా 3.11 ఎకరాల్ని రిజిస్టర్‌ చేయించుకున్నారు.

అటవీ భూమిలో తారురోడ్డు : మంగళంపేట- కొత్తపేట సమీపంలోని గంగమ్మగుడి నుంచి ఎలుకదూనిపెంట ఎస్టీకాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలని పెద్దిరెడ్డి చెప్పారని విజిలెన్స్ పేర్కొంది. ఇందుకోసం రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలో తీర్మానం చేయించారని తెలిపింది. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ భూమిలో తారు రోడ్డు నిర్మించారని విజిలెన్స్ స్పష్టం చేసింది.

అటవీ, రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నేరపూరిత విశ్వాస ఘాతుకం కింద జీవిత ఖైదు లేదా పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలని సూచించింది. అంతేకాకుండా పలు సెక్షన్లను సూచించింది. రెవెన్యూ, అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించాలని తెలిపింది. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎంత మొత్తంలో ఆక్రమించుకున్నారో నిగ్గు తేల్చాలని నివేదికలో సూచనలు చేసింది. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తున్నా, చూస్తూ ఊరుకున్న రెవెన్యూ, అటవీ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. అయితే సర్కార్ ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి .