ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవదాయ-ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని హైందవ శంఖారావం సభ డిమాండ్ చేసింది. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన శంఖారావానికి హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు విచ్చేశారు. భారీసంఖ్యలో హిందువులు తరలివచ్చారు. కాషాయ జెండాల రెపరెపలతో సభా ప్రాంగణం కళకళలాడింది. హిందూధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు.
విజయవాడ సమీపంలోని కేసరపల్లి కాషాయవర్ణం సంతరించుకుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. భరతమాత చిత్రపటం వద్ద వీహెచ్‌పీ నేతలు, పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. శంఖారావం బహిరంగసభ ప్రారంభానికి ముందు పండితులు వేద మంత్రోచ్ఛరణ, సామూహిక ఏకతామంత్ర ఆలాపన చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్‌తో వీహెచ్‌పీ నిర్వహించిన ‘హిందూ శంఖారావం’ సభకు పెద్ద సంఖ్యలో హిందువులు హాజరయ్యారు.
‘చిన జీయర్ స్వామి ఆలయానికి సంబంధించిన ఆస్తి ఎక్కడ ఉన్నా ఆలయానికే చెందుతుందని అన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన అన్నారు. కబ్జాకు గురైన ఆలయాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని జీయర్ డిమాండ్ చేశారు.
గత ఐదేళ్లలో హిందూ మతంపై పెద్దఎత్తున దాడి జరుగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ డి.పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయి. హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని ఆమె సూచించారు.
సినిమాల్లో హిందూ మతాన్ని అవమానిస్తున్నారు..
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని కించపరిచే సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సినిమా అనేది కమర్షియల్ ఆర్ట్ అని, సమయం తీసుకునే వ్యాపారం అని అన్నారు. ఈ రెండింటినీ కలిపే క్రమంలో హిందూమతం మసకబారుతుందని అన్నారు. చేస్తున్న తప్పులను బహిరంగంగా విమర్శిస్తానని అన్నారు. హిందుత్వంపై ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన వ్యక్తిగత దాడులను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా సమాజానికి చెబుతున్నానని అనంత్ శ్రీరామ్ అన్నారు.
ఆలయ భూముల కబ్జాలు, అర్చకులపై దాడులు, హుండీల దొంగతనం వంటి ఘటనలు జరగడం దారుణమని కమలానంద భారతి అన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవాలయాల నిర్వహణ బాధ్యతలు హిందువులకే ఉండాలని వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకోవడం సరికాదన్నారు.