Khammam: అప్పు ఇచ్చిన బిచ్చగాడికి ఐపీ పెట్టిన ఘనుడు..

డబ్బుకోసం అన్ని వదిలేస్తున్నారు కొందరు. ఎంత వరకైనా దిగజారిపోతున్నారు. పైగా ఈ దారుణాలకు ఎక్కువగా పాల్పడేది డబ్బు, వ్యాపారాలు ఉన్నవాళ్లే కావడం మరింత దారుణం. అలాంటి ఘటనే ఖమ్మంలో చోటుచేసుకుంది. ఇది కూడా.. ఓ ముసలాయన.. ఒంట్లో సత్తువలేక బిచ్చగాడిగా మారాడు. ఓ గుడి దగ్గర యాచన చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బులో కొంత బిడ్డ భవిష్యత్‌ కోసం దాచుకున్నాడు. ఆ డబ్బు తనకిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపాడు వ్యాపారి. తీరా ఇచ్చాక ఎగ్గొట్టాడు. అలా ఆ వ్యాపారి మొత్తం 69 మందిని దోచేశాడు.

ఖమ్మం జిల్లాలోని  బోనకల్ మండల కేంద్రంలో  సాయిబాబా గుడి దగ్గర భార్యతో కలిసి అశోక్‌ అనే యాచకుడు ఎన్నో ఏళ్ల నుంచి బిచ్చం ఎత్తుకుంటున్నాడు. అయితే మూడు సంవత్సరాల క్రితం వారు దాచుకున్న 50వేల రూపాయాలను అప్పుగా తీసుకున్నాడు హోటల్ వ్యాపారి నర్సింహారావు. అప్పటి నుంచి వడ్డీ ఇవ్వకపోగా.. మొత్తానికే పంగనామం పెట్టాడు. అప్పు తిరిగి ఇవ్వకుండా మొఖం చాటేశాడు.

ఇటీవల ఆ వ్యాపారి యాచకుడితో పాటు మొత్తం 69 మందికి ఐపీ నోటీసులు పంపాడు. ఖమ్మంలోని సివిల్ కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. మొత్తం ఒక కోటీ 95లక్షల అప్పు తీసుకొని.. 69మందికి ఐపీ నోటీసులు ఇచ్చాడు. నోటీసులు పొందిన వారిలో యాచకుడు గొళ్లల అశోక్ కూడా ఉండడంతో స్థానికులంతా విస్తుపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా బిచ్చం ఎత్తుకుని.. దాచుకున్న డబ్బును వ్యాపారి నర్సింహారావును నమ్మి ఇస్తే నట్టేట ముంచాడని యాచకుడు అశోక్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన బిడ్డ చదువు కోసం దాచుకున్న డబ్బును వ్యాపారికి అప్పుగా ఇచ్చానని.. తనకు న్యాయం చేయాలంటూ వేడుకొంటున్నాడు యాచకుడు.