NASA: జూన్ 2024 ప్రారంభంలో అంతరిక్షం (Space) లోకి ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams) , బారీ బుచ్ విల్ మోర్ లు (Barry Bhuch Wilmore) వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారిని ఎప్పుడు, ఎలా వెనక్కి తీసుకురావాలనే దానిపై నాసా తీవ్రంగా ఆలోచిస్తోంది.
ఈ మేరకు రాబోయే రోజుల్లో వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకువెళ్లడానికి స్టార్ లైనర్ (Starliner) ను క్లియర్ చేయాలని నాసా (NASA) భావిస్తోందని తెలుస్తోంది. అధికారులు స్టార్ లైనర్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం వ్యోమగాములు తిరిగి రావడానికి ముందు కక్ష్యలో అదనంగా ఆరు నెలల పాటు వేచి ఉండాల్సి వస్తుంది.
ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్ మోర్ ను బోయింగ్ స్టార్ లైనర్ ( Boeing Starliner) క్యాప్సూల్ లోనే తీసుకురావాలా? లేదా వచ్చే సంవత్సరం వరకు వేచి ఉండి ఫిబ్రవరి 2025లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ లో తీసుకురావాలా? అనే విషయంపై నాసా త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
అయితే జూన్ 5వ తేదీన సునీతా విలియమ్స్, విల్ మోర్ లు అంతరిక్షంలోకి వెళ్తున్న సమయంలో బోయింగ్ స్టార్ లైనర్ గాల్లోకి లేవడానికి ముందే దాని ప్రొపల్షన్ – సంబంధిత పైపులలో లీకేజీ కనిపించింది. అయితే ఈ హీలియం లీక్ (Helium Leak) చిన్నదే అంటూ బోయింగ్ సంస్థ నాసా ప్రయోగాన్ని కొనసాగించాయి. తరువాతి రోజు స్టార్ లైనర్ లో మరో నాలుగు లీక్ లు కనిపించాయని తెలుస్తోంది. అదేవిధంగా ఐదు థ్రస్టర్లు (Five Thrusters) విఫలం అయ్యాయని గుర్తించారు. అయితే స్టార్ లైనర్ క్యాప్సూల్ సురక్షితంగా డాక్ అయింది. కానీ ఈ ఐదింటిలో నాలుగు థ్రస్టర్లు పని చేశాయి. రెండు నెలలుగా అంతరిక్షంలో థ్రస్టర్ టెస్ట్ ఫైరింగ్ లు నిర్వహించినప్పటికీ వైఫల్యానికి కారణం తెలియలేదు.
ఒకవేళ తిరిగి వచ్చే సమయంలో థ్రస్టర్లు మళ్లీ విఫలం అయితే వ్యోమగాముల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు దీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండటం వలన వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. మైక్రోగ్రావిటీకి గురి కావడం వలన ఎముకల సాంద్రత కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.