Ola Electric IPO : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ షేర్లు స్టాక్ ఎక్స్చేంజీలు బీఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ రెండింటీలో జాబితా చేయబడ్డాయి.
మంచి బజ్ తో స్టాక్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఫ్లాట్ గా లిస్ట్ అయింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో రూ.75.99, ఎన్ఎస్ఈ నిఫ్టీలో రూ.76 వద్ద ప్రారంభం అయ్యాయి. ఇది ఐపీఓ సమయంలో నిర్ణయించిన అప్పర్ బ్యాండ్ తో సమానమని తెలుస్తోంది. అయితే అమెరికాలో మాంద్యం భయాలు, జపాన్ వడ్డీ రేట్ల పెంపుతో అంతర్జాతీయ మార్కెట్ లతో పాటు దేశీయ సూచీలు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓలో ఫ్లాట్ టు డిస్కౌంట్ లిస్టింగ్ ఉండే అవకాశం ఉందని నిపుణులు ముందుగానే భావించారు. అందుకు తగినట్లుగానే ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ లిస్టింగ్ రోజు ఉదయం గ్రే మార్కెట్ ప్రీమియం డిస్కౌంట్ లో కనిపించగా.. ఓపెనింగ్ ఫ్లాట్ గా జరిగింది.
ఐపీఓ వివరాలు:
సుమారు రూ.6,145.56 కోట్ల విలువైన ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ మొత్తం 4.45 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యాయి. కాగా ఇష్యూలో 198.17 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. ఇక రిటైల్ కేటగిరీలో 4.05 సార్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ (క్యూఐబీ) కేటగిరీలో 5.53, నాన్ -ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐ) కేటగిరీలో 2.51 సార్లు పబ్లిక్ ఇష్యూ సబ్ స్క్రైబ్ అయింది.
ఆగస్ట్ 2న ఐపీఓ ప్రారంభం కాగా..6వ తేదీ వరకు అందుబాటులో ఉంది. దీనిలో ఒక్కో షేరుకు రూ. 72 నుంచి రూ.76గా నిర్ణయించింది. ఈ క్రమంలోనే రూ.5,500 కోట్ల విలువైన 72.37 కోట్ల ఈక్విటీ షేర్లు, రూ.645.56 కోట్ల విలువైన 8.49 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ కాంపొనెంట్ కలిపి బుక్ బిల్ట్ ఇష్యూ ద్వారా రూ.6,145.56 కోట్లను ఓలా సమీకరించింది. ఓలా ఎలక్టిక్ ఐపీఓలో లీడ్ మేనేజర్లుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, యాక్సిస్ క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, గోల్డ్మన్ శాక్స్ సెక్యూరిటీస్, బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఉండగా, లింక్ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఐపీఓ రిజిస్ట్రార్ గా వ్యవహరించింది.