Hijab Issue: కాలేజ్ క్యాంపస్ లో హిజాబ్, బురఖా మరియు క్యాప్, నఖాబ్ లు ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఓ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్ పై సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. దుస్తులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ విద్యార్థినులకు ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే సంబంధిత కాలేజ్ యాజమాన్యానికి అత్యున్నత న్యాయస్థానం నోటీస్ జారీ చేసింది. దీనిపై నవంబర్ 18వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అయితే క్యాంపస్ లో హిజాబ్, బురఖాలకు వ్యతిరేకంగా ముంబైలోని ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై కొందరు విద్యార్థునులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థునుల పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగానే కాలేజ్ జారీ చేసిన సర్క్యులర్ పై పాక్షికంగా స్టే విధించింది. అదేవిధంగా హిజాబ్ పై న్యాయస్థానం ఉత్తర్వులను దుర్వినియోగం చేయకూడదని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 18 వ తేదీకి వాయిదా వేసింది.