Telangana Police: ధర్నా చేసిన 39 మంది కానిస్టేబుళ్లపై వేటు

ప్రజలు, ఇతర వర్గాలు ధర్నాలు చేస్తే, ఇప్పుడు పోలీసులు, వారి కుటుంబాలే నిరసనకు దిగుతుండటం సంచలనంగా మారింది.. తమను వెట్టిచాకిరి చేయిస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆందోళనలు నిర్వహించారు. సంబంధం లేని పనులు చేయిస్తున్నారని.. తమిళనాడు, కర్ణాటక మాధిరి ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ పోలీసులు డిమాండ్ చేశారు. అయితే.. బెటాలియన్‌ పోలీసుల ఆందోళనలపై పోలీస్‌శాఖ సీరియస్ అయింది. ఆందోళనలను ప్రేరేపిస్తూ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్న కొందరిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది.

ఆర్టికల్ 311 ప్రకారం ఆందోళనలను ప్రేరేపిస్తున్న 39 మందిని పోలీస్‌శాఖ సస్పెండ్ చేసింది. తెలంగాణలోని 3, 4, 5, 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెన్షన్ చేస్తూ తెలంగాణ పోలీస్‌శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.  తమ భర్తలకు సెలవులు ఇవ్వడం లేదంటూ భార్యలు రోడ్డెక్కారు. ఈ క్రమంలో ప్రభుత్వం సైతం స్పందించి దీనిపై పునరాలోచిస్తామని వెల్లడించింది.. ఈ క్రమంలోనే.. స్వయంగా పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ధర్నాకు దిగడంతో డిపార్ట్‌మెంట్ చర్యలకు ఉపక్రమించింది.