హైదరాబాద్: గత డిసెంబరులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ త్వరాత మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల బిజీలో ఉండిపోయారు. దాంతో వారు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ రాష్ట్రాల ఎన్నికలు పూర్తవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సహా ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళుతుండటంతో కేబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. CWC సమావేశంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి.. కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోందని ఈసారి విస్తరణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. దీంతో కేబినెట్ విస్తరణపై ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో కేబినెట్ విస్తరణ ఇక ఎంతో దూరంలో లేదన్నది స్పష్టమైంది.