ఓ శునకం యజమాని మరణాన్ని తట్టుకోలేకపోయింది. నెల రోజులుగా ఫోటో ఎదుట ఆవేదనతో కూర్చింది. అంతే కాదు అన్నం తినడం కూడా మానేసింది.. ఎప్పుడూ యాజమానితో గడిపిన ఆ కుక్క..ఆయన కనబడకపోవడంతో తట్టుకోలేకపోయింది.. చివరకు తనువు చాలించింది. ఈ హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరి కంటనీరు పెట్టించింది. జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి నెలరోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. తనను అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క (క్యాచ్ ఫార్ ల్యాబ్) యజమాని కనిపించకపోవడంతో తిండి తిప్పలు మానేసి ప్రతి రోజు యజమాని ఫోటో ముందు కూర్చుని దీనంగా ఉంటుంది.
సమ్మిరెడ్డికి కుక్కలు అంటే ఎనలేని ప్రేమ. ఎప్పుడూ ఎటు ప్రయాణం చేసినా, వాకింగ్ చేసినా, ఇంట్లో ఉన్నా సరే తన వెంట కుక్క ఉండేది. యజమాని నెల రోజులైనా కనిపించకపోవడంతో తిండి తినలేక అటు యజమాని కనిపించకపోవడంతో బాధతో కృంగిపోయి సరిగా సమ్మిరెడ్డి నెలరోజుల దినం రోజు ఇంటి ముందు అందరూ కనిపిస్తున్న తన యజమాని కనిపించకపోవడంతో బాధతో ఆ కుక్క నేలపైనే మృత్యువాత పడింది.
అది గమనించిన కుటుంబ సభ్యులు సమ్మిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరేలా లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి, గ్రామ శివారులోని ప్రాంతంలో పూడ్చిపెట్టారు. కుక్క చనిపోవడాన్ని చూసిన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కన్నీరు పెట్టుకున్నారు.