జీపీఎస్ ట్రాకర్, కెమెరాతో సంచరిస్తున్న ఒక గద్ద స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో గద్ద లాంటి పక్షి స్థానికుల కంట పడింది. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఈ వింత పక్షి కి జీపీఎస్ ట్రాకర్లతో పాటు కెమరాలు ఉండటం కలకలం రేపింది. మూడు రోజుల క్రితం చర్ల నాయక కాలనీ సమీపంలో గుట్ట వద్ద ఈ పక్షి కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోటోలు వీడియోలు తీశారు.
అయితే ఈ ఘటన మూడు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. తాము ఎలాంటి పక్షినీ వదల్లేదని చెప్పారు. అయితే ఈ వింత పక్షి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు..? అనే కోణంలో విచారిస్తున్నారు.
చర్ల అటవీశాఖ అధికారులు రాబందు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పోలీసు నిఘా వర్గాలు కూడా ఆరా తీశారు. చివరికి ఆ పక్షిని చర్ల మండల చిన్న మిడిసిలేరులోని తాలిపేరు గ్రామ ప్రాజెక్టు సమీపంలో గుర్తించారు. దానిని పట్టుకుని చర్ల అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ పక్షిని ఎక్కడికి పంపించాలనేది అటవీశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.