- యూపీఐ లావాదేవీల కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు
- జనవరి ఒకటో తేదీ నుండి అమలు
- పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి
యూపీఐ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ) కొత్త నియమాలను ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలకు మద్ధతుగా తీసుకురాబడ్డ ఈ నిబంధనలు జనవరి ఒకటో తేదీ నుండి అమలులోకి వస్తాయని ఆర్బీఐ ప్రకటించింది.
జనవరి 1 నుండి యూపీఐ 123 చెల్లింపు లావాదేవీల పరిమితి పెరగనుంది. ప్రస్తుతానికి రూ.5000 గా ఉన్న యూపీఐ చెల్లింపు పరిమితి జనవరి ఒకటి నుంచి రూ.10,000 వరకు పెరగనుంది. ఆర్బీఐ ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు ఈ నియమాలను పాటించి, కస్టమర్లకు సేవలను అందించేందుకు గడువు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకటో తారీఖు నుంచి రూ.10 వేల వరకు లిమిట్ పెంపు అమలు కానుంది. అదేవిధంగా ఆర్బీఐ యూపీఐ లైట్ వాలెట్ల కోసం కూడా పరిమితులు పెంచింది. వాలెట్ బ్యాలెన్స్ పరిమితిని రూ.2 వేల నుండి రూ.5 వేలకు పెరిగింది. అలాగే ప్రతి లావాదేవీ పరిమితి రూ.500 నుంచి రూ.1000 వరకు పెరిగింది. ఈ కొత్త నియమాలను అమలు చేయాలని నిర్ణయించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ జనవరి 1 నుండి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీ పరిమితిని పాటించాలని సూచించింది.
యూపీఐ చెల్లింపు పరిమితులతో పాట మరో కొన్ని రూల్స్ అమలులోకి రానున్నాయి. యూపీఐ 123 పే ద్వారా జరిగే లావాదేవీలకు సర్వీస్ ఛార్జ్ ఉండదు. ఫోన్ లలో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడంతో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే వినియోగదారులు ఇంటర్నెట్ అవసరం లేకుండా యూపీఐ సేవలను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటుగా పాన్ కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ తప్పనిసరి చేసింది. లేని పక్షంలో పాన్ కార్డును నిలిపివేయనుంది.