జొమాటో సీఈఓ చేసిన ఒక ప్రకటన సంచలనంగా మారింది. అందరూ దానిపై ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారిగా ఆయన మీడియాలో మెరిశారు. జొమాటోలో అత్యున్నత పోస్టుకు తెలి వైన, చురుకుదనం, నేర్చుకోవాలనే తపన ఉన్న అభ్యర్థి కావాలని సీఈఓ దీపిందర్ గోయెల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. సంస్థలోనే అత్యున్నత పోస్టు అంటున్నారు కాబట్టి జీతం కూడా భారీగానే ఉంటుందని అనుకోవడం సహజం. అయితే ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా చెల్లించబోమని చెప్పారు. ఎంపికైన అభ్యర్థే రూ.20 లక్షలు కంపెనీకి చెల్లించాలని కోరారు.
తొలి ఏడాది కోసం ఫీజుగా రూ.20 లక్షలను జొమాటో ఆధ్వర్యంలోని నాన్ ప్రాఫిట్ కంపెనీకి విరాళంగా అందించాలని, ఏడాదిపాటు సంతృప్తికరంగా పనిచేస్తే ఆ మరుసటి ఏడాది నుంచి రూ.50 లక్షలకు పైగా వార్షిక వేతనంతో నియామకపు ఉత్తర్వులు ఇస్తామని వివరించారు. ఆ తొలి ఏడాదికి సంబంధించి రూ.50 లక్షలను ఉద్యోగి సూచించిన ఛారిటీ సంస్థకు జొమాటో విరాళంగా ఇస్తుందని దీపిందర్ పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా రెజ్యుమె పంపాల్సిన అవసరం లేదని, ఆసక్తి ఉన్న వారు నేరుగా తనకే ఓ కవరింగ్ లెటర్ రాయాలని చెప్పారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.