ఆస్పత్రులో అగ్ని ప్రమాదాలు, చిన్నారుల దారుణ మరణాలకు ఉత్రరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎందుకు వరుసగా ఈ ఘోరాలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో శుక్రవారం రాత్రి మరో విషాదం చోటుచేసుకుంది. ఝాన్సీ నగరంలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో ఎన్ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 10.35 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది చిన్నారులు మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎన్‌ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు ఉండగా వారిలో 44 మందిని సిబ్బంది రక్షించగలిగారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రెండు యూనిట్లు ఉండగా ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. బయట వైపునకు ఉండే యూనిట్‌లోని పిల్లలను సిబ్బంది రక్షించగలిగారు. కానీ లోపలి వైపునకు ఉండే యూనిట్‌లో కొంత మందిని మాత్రమే కాపాడగలిగామని ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ ప్రకటించారు. మంటలను ఆర్పివేయడానికి ఆరు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించామని చెప్పారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో వార్డు కిటికీలను పగలగొట్టి రోగులను వైద్యులు, వైద్య సిబ్బందిని రక్షించారు. పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది రెస్క్యూ చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో హాస్పిటల్ ప్రాంగణంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా భయాందోళనలకు గురైన రోగులు, వారి కుటుంబ సభ్యులు కనిపించారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలోని ఎన్‌ఐసీయూలో జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరం అని, హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. మరణించిన చిన్నారుల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మరోవైపు మృతి చెందిన 10 మంది చిన్నారుల్లో ఏడుగురిని గుర్తించామని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, వైద్య, విద్యాశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.