Thiruvonam Bumper Lottery:  రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఓ మెకానిక్

ఓ మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదృష్టం తలుపుతట్టింది అన్నట్టు అతడికి భారీ జాక్ పాట్ కాళ్లదగ్గరకు వచ్చి పడింది. అంతే ఊహించని విధంగా డబ్బు వచ్చిపడింది. ఇంకే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్‌  అల్తాఫ్ కు కేరళ తిరువోణం బంపర్ లాటరీ తగిలింది.  దీంతో అత‌డి బ్యాంక్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ. 25కోట్లు వ‌చ్చి పడ్డాయి.

ఆ లాటరీకి సంబంధించిన డ్రాను తిరువ‌నంత‌పురంలోని గోర్కీ భ‌వ‌న్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నిర్వహించారు. అల్తాఫ్‌ను లాట‌రీ వ‌రించిన‌ట్లు నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ఈ డ్రాలో రాష్ట్ర ఆర్థిక‌శాఖ మంత్రి కేఎన్ బాల‌గోపాల‌న్‌, ఎమ్మెల్యే వీకే ప్రశాంత్, లాట‌రీ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్ అబ్ర‌హం రెన్న్ పాల్గొన్నారు.

భారీ జాక్‌పాట్ త‌గ‌ల‌డంపై అల్తాఫ్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.  15 ఏళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇన్నాళ్లకు తనను అదృష్టం వరించిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ప్రైజ్‌ మనీతో త‌న పిల్ల‌ల పెళ్లి ఘ‌నంగా జ‌రిపిస్తాన‌ని చెప్పాడు.  తాను ఈ ల‌క్కీ టికెట్‌ను సుల్తాన్ బాత్‌రే పరిధిలోని ప‌నామార‌మ్‌లో ఉన్న ఎస్‌జే ల‌క్కీ సెంట‌ర్‌లో కొనుగోలు చేసిన‌ట్లు తెలిపాడు.   కేరళకు చెందిన ఈ తిరువోణం బంపర్‌ లాటరీ ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ ఇస్తుంది. గ‌తేడాది ఈ బంప‌ర్ లాట‌రీని  త్రిసూర్‌, త‌మిళ‌నాడుకు చెందిన‌ న‌లుగురు గెలుచుకున్నారు.