పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూపు సంస్థల అధిపతి రతన్ టాటా(86) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి 11.30ని.లకు ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎస్.చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.
రతన్ టాటా పలు అనారోగ్య సమస్యల వల్ల బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో చికిత్స పొందుతూనే కన్నుమూశారు.
రతన్ టాటా 28 డిసెంబర్ 1937న నావల్ టాటా-సోనీ టాటా దంపతులకు జన్మించారు. విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత మొదట టాటా గ్రూప్ కంపెనీ టాటా ఇండస్ట్రీస్‌లో అసిస్టెంట్‌గా చేరారు. 1991లో ‘టాటా సన్స్’ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1991 మార్చి నుంచి డిసెంబర్ 2012 వరకు టాటా గ్రూప్‌ను నడిపించారు. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి పారిశ్రామికరంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు.
ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ సంస్థ ఉన్నత శిఖరాలకు చేరింది. టాటా గ్రూప్స్ సంస్థ 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఉన్నత శిఖరాలకు ఎదిగింది. పారిశ్రామికవేత్తగానే కాకుండా రతన్ టాటా గొప్ప మానవతావాది కూడా. రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. సంపాదించిన లాభాల్లో దాదాపు 60 నుంచి 65శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందజేశారు.
భారత ప్రభుత్వం 2008లో ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. అంతకు ముందు పద్మ భూషణ్ కుడా అందుకున్నారు. ఆయన మరణవార్త తెలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.