Ratan Tata: రతన్ టాటా ప్రేమ కథ తెలుసా?

అంతర్జాతీయంగా పారిశ్రామికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొందిన రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? ఆయనకు ఒక మంచి ప్రేమ కథ ఉందని తెలుసా? ప్రేమ విషయాన్ని  ఆయనే ఒకసారి స్వయంగా వెల్లడించారు. రతన్ టాటా తాత పేరు రతన్‌జీ టాటా. రతన్ టాటా తండ్రి నావల్ టాటాను ఓ అనాథాశ్రమం నుంచి రతన్‌జీ, ఆయన తొలి భార్య సూనూ దత్తత తీసుకున్నారు.

స్విట్జర్లాండ్ జాతీయురాలైన సిమోన్‌ను ఆ తర్వాత నావల్ టాటా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కలిగిన కుమారుడు నోయెల్ టాటా ‘ట్రెంట్’ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు విడాకులు తీసుకునేటప్పుడు రతన్ టాటా వయసు 10 ఏళ్లు మాత్రమే. ఆ కష్ట సమయంలో నానమ్మ తనకు అండగా నిలిచారని, తనకు మార్గనిర్దేశకత్వం చేశారని రతన్ టాటా పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఆమె తనను దృఢంగా మార్చారని పేర్కొన్నారు.

రతన్ టాటా అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. తర్వాత  టాటా అక్కడే రెండేళ్లపాటు పనిచేశారు. అమెరికాలో ఆ రోజులు ఎంతో మధురంగా ఉండేవని రతన్ టాటా ఒకసారి గుర్తుచేసుకున్నారు. తనకు సొంతంగా కారు ఉండేదని, ఉద్యోగాన్ని ఎంతగానో ప్రేమించేవాడినని చెప్పారు.  ఆ సమయంలోనే ఆయన ప్రేమలో కూడా పడ్డారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు.  నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా ఇండియా వచ్చారు. నానమ్మను చూసేందుకు వచ్చిన ఆయన ఏడేళ్లపాటు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

అయితే తన ప్రియురాలు తన కోసం భారత్ వస్తుందని  టాటా భావించారు.  అదే సమయంలో  1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియా పంపేందుకు అంగీకరించలేదు. దీంతో వారి బంధానికి ఫుల్ స్టాప్ పడింది.  ఆ తర్వాత రతన్ టాటాపై టాటా గ్రూపును నడిపించాల్సిన బాధ్యత పడింది. అప్పటి నించి వెను తిరిగి చూడకుండా కష్టపడి ఆ గ్రూపును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన తీరిక లేకుండా గడపడంతో వివాహం చేసుకోలేకపోయానని రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.