ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా ఈ స్కీం లో అర్హులే . ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌లో తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి కలుగుతుందన్నారు. వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఏడాదిలో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం పొందవచ్చన్నారు. ఇప్పటికే ఈ పథకం వర్తిస్తున్న కుటుంబాల్లోని 70 ఏళ్లు, ఆ పైబడిన వారుంటే… వారికి అదనంగా ఏడాదికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. ఒకవేళ ఇతర ప్రభుత్వ బీమా పథకాల్లో (సీజీహెచ్‌ఎ్‌స, ఈసీహెచ్‌ఎ్‌స, సీఏపీఎఫ్) ఏవైనా వర్తిస్తుంటే.. దాన్ని లేదా ఆయుష్మాన్ భారత్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు ఆరోగ్య బీమా పాలసీలు ఉన్నా లేదా కార్మిక రాజ్య బీమా (ఈఎ్‌సఐ) పథకం వర్తిస్తున్న వారు ఆయుష్మాన్ భారత్‌లో కూడా లబ్ధి పొందవచ్చు. ఈ పథకంలో అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా కొత్త కార్డు జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ పథకంలో 12.34 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మందికి ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది. పరిమితి ఏడాదికి రూ.5 లక్షలు. ఈ పథకంలో ప్రజలు ఇప్పటిదాకా లక్ష కోట్ల రూపాయల లబ్ధి పొందారని, లబ్ధిదారుల్లో 49 శాతం మహిళలని కేంద్రం పేర్కొంది. ప్రపంచంలో ప్రభుత్వాలు అమలుచేసే ఆరోగ్య బీమా పథకాల్లో అతి పెద్దదిగా ఆయుష్మాన్ భారత్‌కు పేరుంది. ఈ పథకాన్ని 70 ఏళ్లు, ఆ పైబడిన వారి కోసం విస్తరిస్తామని ప్రధాని మోదీ ఏప్రిల్‌లో ప్రకటించారు. కాగా, కేంద్ర క్యాబినెట్ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నాలుగో దశ అమలుకు పచ్చజెండా ఊపింది. రూ.70,125 కోట్లతో 62,500 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను నిర్మించనున్నారు . ఈ మొత్తంలో కేంద్రం వాటా రూ.49,087 కోట్లు కాగా.. రాష్ట్రాలది రూ.21,037 కోట్లు. ఈ రహదారుల నిర్మాణంలో 25 వేల నివాస ప్రాంతాలు అనుసంధానం అవుతాయని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకానికి ఆమోదం తెలిపింది. దీనికి రెండేళ్లలో రూ.10,900 కోట్లు ఖర్చు చేయనుంది. దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటు అందించనుంది. 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 12,461 కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఎనిమిదేళ్లలో ఆయా ప్రాజెక్టుల అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారు.