Haryana: హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో (బుధవారం) ఉదయం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలిపారు.
“నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హరియాణాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్ల పాటు ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటుంది. మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఎన్నికల సమయంలో ఏ విషయాన్నీ ప్రతిపక్షం వదిలిపెట్టలేదు. అగ్నివీర్లకు సంబంధించి తప్పుడు ఊహాగానాలు సృష్టించింది. ప్రతి అగ్నివీర్‌కు పెన్షన్‌తో కూడిన ఉద్యోగాన్ని ఇస్తాం” అని అమిత్ షా హామీ ఇచ్చారు.