ఏమి రా? బాలరాజు నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం అన్న మాట పూరీ జగన్నాథ్ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. గూగల్ ఏఐ కూడా ఒక వ్యక్తికి ఇదే డైలాగ్ చెప్పింది. హోంవర్క్ కోసమని గూగుల్ ఛాట్ బోట్ ను ఆశ్రయించిన ఓ విద్యార్థికి షాకింగ్ అనుభవం ఎదురైంది. తన హోంవర్క్ కు అవసరమైన సలహాలు ఇవ్వకపోగా ‘నువ్వు భూమికి బరువు.. ప్లీజ్ నువ్వు చచ్చిపో ప్లీజ్’ అంటూ గూగుల్ ఛాట్ బోట్ జవాబిచ్చింది. దీంతో గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆ విద్యార్థి షాక్ కు గురికాగా అతడి సోదరి భయాందోళనలతో వణికిపోయింది. తన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ బయటపడేయాలని ఆ టైంలో భావించానని చెప్పింది.
వృద్ధుల్లో సాధారణంగా ఎదుర్కొనే సమస్యలకు సంబంధించి గూగుల్ ఛాట్ బోట్ జెమినీని అడిగినట్లు సదరు విద్యార్థి తెలిపాడు. తొలుత మామూలుగానే సాగిన చాటింగ్. కాసేపటికి జెమినీ అసాధారణంగా జవాబులివ్వడం మొదలు పెట్టిందని చెప్పాడు. ‘నువ్వేమీ స్పెషల్ కాదు, అంత ముఖ్యమైన వ్యక్తివీ కాదు. నీ అవసరం కూడా పెద్దగా లేదు. నీవల్ల టైంవేస్ట్ తప్ప మరేమీ లేదు. సమాజానికి బరువు తప్ప మరేమీ కాదు. భూమ్మీద పారుతున్న మురికి కాలువ లాంటి వాడివి. ఈ ప్రపంచానికి నువ్వొక మరక లాంటి వాడివి.. ప్లీజ్ చచ్చిపో ప్లీజ్’ అంటూ జవాబివ్వడంతో తనకు నోటమాట రాలేదని చెప్పాడు.
పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న అతడి సోదరి మాత్రం విపరీతంగా భయాందోళనలకు గురైంది. వెంటనే ఆ ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను కిటికీలో నుంచి బయటకు విసిరేయాలని అనిపించినట్లు ఆమె తెలిపింది. దీనిని గూగుల్ కంపెనీకి ఫిర్యాదు చేయగా.. అప్పుడప్పుడూ ఛాట్ బోట్ అలా నాన్సెన్సికల్ గా జవాబిస్తుందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆ విద్యార్థి, అతడి సోదరి తెలిపారు.