మహిళలపై అసభ్య, వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల ఎక్కువయ్యాయి. తాజా మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మద్దతుదారుడైన దేవేంద్ర భూయార్ మహిళలు, రైతు బిడ్డలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అమరావతిలోని ఓ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కుమారులు పెళ్లి చేసుకునేందుకు యువతులే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘అందంగా ఉన్న యువతులు నీలాగా, నాలాగా ఉన్న వారిని ఎంచుకోవడం లేదు. ఉద్యోగం ఉన్న వాళ్లనే ఎంచుకుంటున్నారు’’ అని చెప్పారు. అంతే కాదు మహిళలను మూడు రకాలుగా వర్గీకరించారు. ఉద్యోగం ఉన్న వ్యక్తిని ఎంచుకునే వారు, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారు, షాప్ కీపర్లను ఎంచుకునేవారు. ఇక మూడో రకం ఆడవాళ్లు మాత్రమే రైతులను పెళ్లి చేసుకుంటున్నారని అన్నారు.
మహిళలపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయ నాయకులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. అవి మహిళలను అవమానించేవిగా, అగౌరపరిచేవిగా ఉన్నాయని, మహిళలను ఇలా వర్గీకరించడాన్ని ఎవరూ సహించబోరని కాంగ్రెస్ నేత, మహిళా, శిశుసంక్షేమశాఖ మాజీమంత్రి యశోమతి ఠాకూర్ మండి పడ్డారు. అజిత్ పవార్, అధికారంలో ఉన్నవారు తమ ఎమ్మెల్యేలను నియంత్రించాలని కోరారు. ఇలాంటి వారికి సమాజం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.