Bike rider: బైక్ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు.. మహిళా డాక్టర్‌కు వేధింపులు

ఓలా లాంటి బైక్ రైడింగ్ అందుబాటులోకి చాలా మందికి ఎందో ఉపయోగంగా ఉంది. ముఖ్యంగా బైక్, కారు లేనివాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా సులువుగా అక్కడికి చేరుకోగలుగుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇంకా  బాగా ఉపయోగపడుతోంది. దీంతో ఈ బైక్ రైడర్స్ గిరాకీ బాగా పెరిగింది. కాని చాలా మంది వేధింపులకు కూడా గురవుతున్నారు. ఈ విధంగా ఓ యాప్ ద్వారా బుక్ చేసుకుని రైడ్ ను  క్యాన్సిల్ చేసిన ఓ మహిళా డాక్టర్ కు వేధింపులు ఎదురయ్యాయి. రైడర్ ఆమెకు పదేపదే అసభ్య వీడియోలు పంపించాడు.  పశ్చిమ బెంగాల్  రాజధాని కోల్‌కతాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..

నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యురాలు శనివారం రాత్రి ఓ యాప్‌లో బైక్ రైడింగ్ బుక్ చేశారు. అయితే బైక్ రావడం ఆలస్యం అవుతుండటంతో రైడ్‌ను రద్దు చేశారు. రైడ్ రద్దు చేసిందన్న ఆగ్రహంతో ఆ రైడర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. వైద్యురాలికి 17సార్లు ఫోన్ చేయడంతోపాటు ఆమె వాట్సాప్‌కు అశ్లీల వీడియోలు పంపాడు. అక్కడితో ఆగకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. దీంతో భయపడిన వైద్యురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.