- జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమెదం
- ఈ నెల 16న లోక్సభ ముందుకు బిల్లు
భారత్ లో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన లోక్ సభ ఎదుటకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు వెళ్లనుందని తెలుస్తోంది. ఈ మేరకు జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది.
దాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మకాశ్మీర్ కు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానం చేసే విధంగా.. చట్టాలను సవరించడానికి ఒక సాధారణ బిల్లుతో పాటు మరో రెండు ముసాయిదా చట్టాలకు మోదీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అయితే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలనూ కూడా నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ తెలిపింది. దీనికోసం రెండు రాజ్యాంగ బిల్లులను ప్రవేశపెట్టాలని పేర్కొంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను మినహాయించి కేవలం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల బిల్లులకు మాత్రమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. కానీ రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల మద్ధతు కావాల్సి ఉంటుంది. లోక్ సభలో మొత్తం 542 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీయేకు 293 మంది, ఇండియా కూటమికి 235 బలం ఉండగా.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 361 మంది సభ్యుల సపోర్ట్ కావాలి. ఈ నేపథ్యంలో ఎన్డీయే ఇండియా బ్లాక్ లోని కొన్ని పార్టీల మద్ధతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన తరువాత పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపే ఛాన్స్ ఉంది. ఈ కమిటీ ద్వారానే రాష్ట్రాల స్పీకర్లతో సంప్రదింపులు నిర్వహించే ఛాన్స్ ఉందని సమాచారం.