రైతుల కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్లతో రుణహామీ పథకం..!

  • ఇకపై సులభంగా రైతులకు రుణాలు
  • రూ.వెయ్యి కోట్లతో క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్
  • ప్రారంభించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఇకపై సులువుగా రుణాలు పొందే విధంగా రూ.1000 కోట్ల రుణ హామీ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన చేశారు. ఈ వెయ్యి కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రారంభించిన ఆయన ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా రైతులు పంటల అనంతరం రుణాలను పొందవచ్చని తెలిపారు. ఇది రైతన్నలు రుణాలను సులువుగా పొందేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు.

వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదులకు రుణం ఇచ్చేందుకు బ్యాంకుల విముఖతను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీం ద్వారా బ్యాంకులు సకాలంలో రైతులకు రుణాలను అందించనున్నాయి. ఇక క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ వ్యవసాయ ఫైనాన్సింగ్ ను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైతుల ఆర్థిక అవసరాలకు సాయం చేయడమే లక్ష్యంగా పని చేయనుంది. ఈ నేపథ్యంలో తాము రూ.1000 కోట్ల కార్పస్ ఫండ్ ను అందించామన్న కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఉదారవాద విధానంతో రుణాలు ఇచ్చేవిధంగా బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.