రాహుల్ గాంధీకి ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ లేఖ

  • నెహ్రు లేఖలను తిరిగి ఇచ్చేయాలని వినతి
  • చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉన్న లేఖలని పేర్కొన్న పీఎంఎంఎల్
  • లేఖలను తిరిగి పొందడంలో సాయం చేయాలన్న ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ (పీఎంఎంఎల్) లేఖ రాసింది. భారతదేశ తొలి ప్రధానిగా పని చేసిన జవహర్ లాల్ నెహ్రు రాసిన వ్యక్తిగత లేఖలను తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఈ లేఖలను సోనియాగాంధీ యూపీఏ ప్రభుత్వ హయాంలో 2018 లో తీసుకున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై సెప్టెంబర్ లో సోనియా గాంధీకి లేఖ రాసిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం తాజాగా డిసెంబర్ 10న రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ఈ క్రమంలో లేఖలను అసలు రూపంలో అయినా, డిజిటల్ కాపీల రూపంలో ఇచ్చినా ఫర్వాలేదని పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ కద్రీ లేఖలో కోరారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, మౌంట్ బాటన్, జయప్రకాష్ నారాయణ్, పద్మజా నాయుడు, అరుణ అసఫ్ అలీ వంటి ప్రముఖులకు, నెహ్రుకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం తెలిపింది. దీంతో ఈ లేఖలను తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ సాయం చేయాలని లేఖలో కోరారు.