మార్చి 2026 చివరినాటికి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుదిముట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధులు ఎన్నో ప్రకటనలు చేశారు. ఇప్పటికే అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మత్రులు, ఇంటెలిజెన్స్ డిపార్టు మెంట్ బాసులతో చాలా సార్లు సమావేశాలు నిర్వహించారు. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అమిత్ షా నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని స్ఫష్టంగా చెప్పారు.
గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతమార్చాయి. 1000 మందిని అరెస్ట్ చేయగా, 837 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపే ఉందని చెప్పారు.
‘నక్సల్ రహిత.. డ్రగ్ రహిత ఇండియా’ కలను సాకారం చేయడంలో చత్తీస్‌గఢ్ పోలీసుల కృషిపై హోంమంత్రి ప్రశ్నంసలు కూడా కురిపించారు. వారి సహకారాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని కొనియాడారు. మిగిలిన నక్సలైట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీరు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు.
చత్తీస్ గడ్ లోని వందల ఎకరాల అడవిని అదాని పవర్ ప్లాంట్ కు కేంద్రం దారాధత్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ఆదివాసీలు పోరాటానికి దిగారు. ఇప్పటికే వందల మంది సాయుధ సైన్యాన్ని ప్రభుత్వం అక్కడ మోహరించింది. ప్రతిరోజు అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డ్రోన్ల సాయంతో గిరిజన గ్రామాల్లో నిత్యం నిఘా నిర్వహిస్తున్నారు. స్నానాలు చేస్తుంటే డ్రోన్లతో ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులు రాక్షస ఆనందం పొందుతున్నారని, అడవే మా జీవనాధారం, అడవే మా సంస్కృతి మమ్మల్ని వెళ్ల గొట్టడానికి సాయుధ బలగాలు అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నారని గిరిజనులు, ఆదివాసీ పోరాట నాయకులు చెబుతున్నారు. మావోయిస్టుల పేరుతో గిరిజనులపై దాడులు, అరెస్టులు చేస్తున్నారని ఇటీవల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో భయపడిని కొంతమంది గిరిజనులు ఊళ్లు వదిలి తెలంగాణ, ఒడిశా అడవులకు వెళ్లిపోతున్నారని గిరిజనులు వాపోతున్నారు.
మావోయిస్టు నేతలు కూడా ఇదే అంశాలను ప్రకటనల ద్వారా తెలియజేస్తున్నారు. అదాని తన ప్లాంట్ కోసం లక్షల చెట్లను నాశనం చేయాల్సి ఉంటుంది. దీంతో వేల కిలోమీటర్లమేర జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ఆ ప్రాంతంలో నివశించే గిరిజనులకు జీవనం లేకుండా పోతుంది. అక్కడ గిరిజనులపై సాయుధ దళాలు జరిపుతున్న ఆకృత్యాలు, అదాని సామ్రాజ్యం గురించి ప్రభుత్వం కాని, మీడియాకాని నోరు విప్పడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ హడావుడి చూస్తుంటే మావోయిస్టుల పేరుతో గిరిజనులను వెళ్లగొట్టి అదానికి ఆ ప్రాంతాన్ని కట్టపెట్టడానికే అనే ఆరోపణలు నిజమే అనేలా అనుమానాలు వస్తున్నాయి.
నక్సలిజం అనేది వివిధ సాామాజిక, ఆర్థిక సమస్యల వల్ల వచ్చింది. ఆ సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరిస్తే అది ముగుస్తుంది. ఆ సమస్యలను పట్టించుకోకుండా, కేవలం అణచివేత వల్ల నక్సలిజమైనా, ఏ పోరాటమైనా ముగుస్తుందా అనేది పెద్ద ప్రశ్న. చాలా ప్రభుత్వాలు మారాయి. పోరాటాలను అణచివేయాలని చూసిన నేతలు ఎంతో మంది పోయారు. కాని ఆ సమస్య అలాగే ఉంది. అమిత్ షా కూడా అంతే అంటున్నారు సోషల్ యాక్టివిస్టులు.