అన్నదాతలకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల రుణం

  • రైతులకు ఆర్బీఐ శుభవార్త
  • ఎలాంటి తనఖా లేకుండా అందించే రుణసదుపాయం పెంపు
  • రూ.2 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం
  • జనవరి 1 నుంచి అమలు

అన్నదాతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు వ్యవసాయ అవసరాలు, పంట సాగు కోసం ఎటువంటి తాకట్టు లేకుండా అందించే రుణ సదుపాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.2 లక్షలకు పెంచింది. వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అయితే వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరుగుతుండటంతో రైతులకు రుణ సదుపాయాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో చిన్న మరియు సన్నకారు రైతులలో 86 శాతం మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో సంబంధించిన మార్గ దర్శకాలను అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది. వ్యవసాయ రంగంలో రైతుల జీవనోపాధితో పాటు వారికి కావాల్సిన ఆర్థిక సౌలభ్యాన్ని అందించేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వ్యూహాత్మక చర్యని తెలిపింది.