ఆసియాలోనే అతి పెద్ద కంపెనీ జపాన్ కు చెందిన డైకిన్. ఆ కంపెనీ ఏపీలో వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. అది కూడా ఈ యేడాదే కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించింది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ కంపెనీ భాగస్వామ్యంతో శ్రీసిటీలో కంప్రెషర్ల తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 75 ఎకరాల్లో యూనిట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ యూనిట్ ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద యూనిట్ గా అవతరించబోతోందని చెప్తున్నారు. ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెషర్లను ఇక్కడ తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
భారత్ లో మొత్తం మూడు యూనిట్లు నెలకొల్పినట్లు అవుతుందని, ప్రస్తుతం ఉన్న రెండు యూనిట్లతో కలిపి ఏటా 2 మిలియన్ కంప్రెసర్లను తయారుచేస్తున్నామని డైకిన్ కంపెనీ వివరించింది. 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందంతో దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందించడం సాధ్యమవుతుందని, భారత మార్కెట్లో ఏసీ విక్రయాల్లో టాపర్ గా నిలవాలన్నదే తమ లక్ష్యమని డైకిన్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో దేశానికి, రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరగనుంది.