హైదరాబాద్: మంత్రి కొండా సురేఖా వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది సినీ నటీనటులు మండిపడ్డారు. అయినతే అక్కినేని అఖిల్ నిన్న (గురువారం) అమల చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేద’ అని పేర్కొన్నాడు అఖిల్.
తాజాగా మరోసారి ఇవాళ (శుక్రవారం) మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు అక్కినేని అఖిల్. కొండా సురేఖ చేసిన నిరాధారమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత సామాజిక సంక్షేమాన్ని మరచిపోయారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. గౌరవనీయమైన పౌరులు, నిజాయితీగల కుటుంబ సభ్యులు గాయపడ్డారు. అగౌరవంగా మిగిలిపోయారు. రాజకీయ యుద్ధంలో గెలవడానికి ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై దాడి చేసి బలిపశువులను చేసింది. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను ఈ విషయంలో మౌనంగా ఉండను. ఇలాంటి వ్యక్తికి.. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు , మన్నన లేదు. ఇది క్షమించబడదు, సహించదు’ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు అఖిల్.