సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు

పుష్ఫ 2 హిట్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. తన మూవీ పుష్ఫ 2 ప్రివ్యూ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేస్తూ దాఖలైన కేసులో ఆయనను అరెస్టు చేశారు. ప్రీమియర్ షో సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా అల్లు అర్జున్ థియేటర్‌ వద్దకు రావడాన్ని పోలీసులు తప్పు పడుతున్నారు. శుక్రవారం ఉదయం అరెస్టుచేసి చిక్కడపల్లి పీఎస్ కు తీసుకెళ్లారు.

అసలేంజరిగింది..

4వ తేదీ రాత్రి పది గంటలకు పుష్ప 2 ప్రీమియర్‌ షో సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఎల్‌బినగర్‌కు చెందిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అల్లు అర్జున్ రాక గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే థియేటర్‌ యజమాని, మేనేజర్‌ను అరెస్ట్‌ చేశారు.

ఇంట్లో ఉన్న అల్లు అర్జున్‌ను టాస్క్‌ఫోర్స్‌, చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిఫ్ట్‌లో కిందకు వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునేందుకు పోలీసులు అనుమతించారు. అరెస్ట్‌ సమాచారం అందుకున్న అల్లు అర్జున్ తండ్రి అరవింద్‌ అక్కడకు చేరుకున్నారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిగా చేస్తున్నట్టు పోలీసులు స్పష్టం చేశారు.

అయితే తనపై దాఖలైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఈ క్రమంలోనే అరెస్టు కావడంపై అంతా ఆసక్తి రేగింది.

ఆ వార్తలు అవాస్తవం

సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పుష్ప 2 ప్రీమియ‌ర్ రోజు జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఓ అభిమాని మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు వచ్చినవి పుకార్లు మాత్రమేనని బ‌న్నీ టీమ్ చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ నిమిత్త‌మే అల్లు అర్జున్ చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన‌ట్లు పేర్కొన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారంలో నిజం లేద‌న్నారు.