అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న విషయం తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలో ట్రంప్ అందరినీ కలుపుపోతున్నాను అనేలా వ్యవహరిస్తున్నారు. మొన్న ఎలన్ మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ప్రశంసించారు. మోదీ తన స్నేహితుడని, ఉత్తమ వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఫ్లాగ్రాంట్ పోడ్కాస్ట్లో ప్రపంచ నాయకులపై తన అంచనా గురించి ట్రంప్ మాట్లాడుతూ మోదీ ప్రధానమంత్రిగా నియమితులయ్యే ముందు భారతదేశం చాలా అస్థిరంగా ఉంది.. దేశానికి అతను ఉత్తమ తండ్రిలా కనిపిస్తున్నారు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.
అంతే కాదు 2019 సెప్టెంబరులో టెక్సాస్‌లో జరిగిన ఐకానిక్ “హౌడీ మోదీ” కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. మోదీతో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన “నమస్తే ట్రంప్” కార్యక్రమానికి భారతదేశాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో 1 లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఇది దేశం వెలుపల అమెరికా అధ్యక్షుడు నిర్వహించిన అతిపెద్ద ర్యాలీ కావడం విశేషం.