modi Meets Ukrainian President Zelenskyy : అమెరికా పర్యటనలో ఉన్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.గత మూడు నెలల వ్యవధిలో మోదీ-జెలెన్‌స్కీల మధ్య జరిగిన మూడో సమావేశం ఇది. రష్యాతో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు భారత్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్బంగా మోడీ పేర్కొన్నారు. శాంతి స్థాపన కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి భారత్ ఎప్పుడూ సుముఖంగా ఉంటుందని చెప్పినట్లు ‘ఎక్స్’ వేదికగా మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, గత నెలలో కీవ్ పర్యటన చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి, రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సమావేశం తరువాత మోదీ భారత్కు తిరుగు ప్రయాణం అయ్యారు. మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించి శాంతి పునరుద్ధరణకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీకి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
నేపాల్, పాలస్తీనా అధినేతలతో మోదీ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ నేపాల్, పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఐరాస సర్వప్రతినిధి సభకు హాజరయ్యేందుకు వచ్చిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌లతో ఆయన విడివిడిగా సమావేశమై సమాలోచనలు జరిపారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.
“భారత్-నేపాల్ స్నేహబంధం ఎంతో బలీయమైనది. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంధనం, సాంకేతికత, వాణిజ్య రంగాలపై తాజా చర్చల్లో మేం దృష్టి సారించాం” అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదిక ద్వారా తెలిపారు. పరస్పర ఆసక్తిదాయక అంశాలపై, భాగస్వామ్య విస్తరణపై చర్చలు సాగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తమ దేశంలో పర్యటించాలని ఓలి ఆహ్వానించగా ఇందుకు మోదీ అంగీకరించారు.