భారత్ పై విషం కక్కుతున్న కెనడా ప్రధానికి తగిన శాస్తి జరగబోతోందా ?
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదరువుతోంది. రాజీనామా చేయాలని 24 మంది లిబరల్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. అక్టోబర్ 28 — డెడ్‌లైన్ విధించారు . ఇప్పటికే మైనార్టీలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వానికి ఇది మరింత సమస్యగా మారింది . ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై మొత్తం 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారని కెనడా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతినడానికి ప్రధాని ట్రూడో వైఖరే కారణమని ఒక సమావేశంలో సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ట్రూడో సన్నిహితుడిగా పేరున్న ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. “ఇది చాలా రోజులుగా నలుగుతున్న విషయం. ప్రజలు దీనిని బయటపెట్టడం అవసరం. ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని ఎంపీలు నిజాయితీగా ప్రధానికి వెల్లడించారు. ఆయనకు వినడం ఇష్టం ఉన్నా లేకపోయినా వారు మాత్రం చెప్పేశారు” అని రిపోర్టర్ల వద్ద వ్యాఖ్యానించారు.
వలసల నియంత్రణకు కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు సిద్ధమైంది. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అక్కడి వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాల ప్రకారం, 2024లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా కెనడా గుర్తించింది. అయితే, 2025లో ఈ సంఖ్య 3,80,000కు మాత్రమే పరిమితం చేసింది. 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “కెనడాలో తాత్కాలిక విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాం. కంపెనీలకు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలు తీసుకురానున్నాం. నియామకాల విషయంలో కంపెనీలు స్థానికులకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదో వెల్లడించాల్సి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి.