ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని జెద్ధాలో ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. తొలి రోజు పది ఫ్రాంఛైజీలు కలిసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే భారత బ్యాటర్ దేవ్ దత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్‌లను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
టీమిండియా ప్లేయర్ అయిన దేవ్ దత్ పడిక్కల్ కోసం ఏ ఫ్రాంఛైజీ బిడ్ దాఖలు చేయలేదు. లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న పడిక్కల్ .. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం లేదు కానీ దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ఆడుతున్నాడు. 24ఏళ్ల ఈ యువ ఆటగాడు ఐపీఎల్ టోర్నీలో దాదాపు 1500లకుపైగా పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 123 పరుగులు. 2023లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలకు ఆడాడు. ప్రస్తుత వేలంలో అత్యధికంగా రిషబ్ పంత్ రూ.27కోట్లు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.75కోట్లు పలికారు.
కానీ రిషబ్, శ్రేయాస్ మాదిరిగా స్టార్ ప్లేయర్ అయిన దేవ్ దత్ పడిక్కల్ మాత్రం ఎంపిక కాలేదు. అలాగే 2009 నుంచి ఐపీఎల్‌లో భాగస్వామిగా ఉన్న డేవిడ్ వర్నర్‌ను కూడా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. డేవిడ్ వర్నర్ తొలుత ఢిల్లీ క్యాపిటల్, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వార్నర్..2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారధిగా ఐపీఎల్ టైటిల్ తెచ్చి పెట్టాడు. ఐపీఎల్‌లో బుల్‌గా చెప్పుకునే వార్నర్.. 6565 పరుగులు చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 140 పరుగులు.