సరైన కారణం లేకుండానే అస్తమానూ కయ్యానికి కాలు దువ్వే మన పొరుగుదేశం చైనా . . సరిహద్దు ప్రాంతంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది . దీపావళి పర్వదినాన ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకుని పరస్పరం అభినందనలు తెలుపుకోవడం విశేషం .
దీపావళి సందర్భంగా వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పలు సరిహద్దు పాయింట్ల వద్ద భారత, చైనా సైనికులు స్వీట్లు పంచుకున్న అరుదైన ఘటన జరిగింది . . తూర్పు లద్దాఖ్‌లోని దెప్పాంగ్, దేమ్‌చుక్ ప్రాంతాల నుంచి సైన్యాల ఉహసంహరణ ప్రక్రియ కొలిక్కి రావడం వల్ల గురువారం ఉదయం మిఠాయిలు అందించుకున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు తెలిపాయి.”దీపావళి సందర్భంగా ఎల్ఏసీ వెంబడి అనేక సరిహద్దు పాయింట్ల వద్ద భారత్, చైనా సైనికులు స్వీట్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అక్టోబర్ 25న మొదలైన బలగాల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో పూర్తయ్యింది. పెట్రోలింగ్ విధి విధానాలను ఖరారు చేసేందుకు క్షేత్రస్థాయిలో స్థానిక కమాండర్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వారే పెట్రోలింగ్ పద్ధతులను నిర్ణయిస్తారు” అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
2020 జూన్‌లో గల్వాన్ లోయలో ఇరుదేశాల సైన్యాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ నేపథ్యంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య పలుమార్లు దౌత్య, కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించగా ఘర్షణల కేంద్రమైన దెప్సాంగ్, దేమ్‌చుక్ వద్ద మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి. అలా నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.