హిందు కెనడీయన్లు రాజకీయాల్లో పాల్గొనాలి అంటూ కెనడా ఎంపీ చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. అక్కడి పార్లమెంట్ వెలుపల ‘ఓం’ గుర్తు కలిగిన కాషాయ జెండాను ఎగురవేశారు. నవంబర్ లో హిందూ హెరిటేజ్ మాసాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. కెనడా రాజకీయ రంగంలో మన ప్రాతినిధ్యం చెప్పుకోదగినంతగా లేదన్నారు. 2022 నుండి హిందూ వారసత్వ మాసంలో చంద్ర ఆర్య హిందూ జెండాను ఎగురవేయడం ఇది మూడోసారి.
కెనడాలో హిందూ వారసత్వ మాసాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. హిందూ మతానికి సంబంధించిన సాంస్కృతిక, మేథోపరమైన, ఆధ్యాత్మిక వారసత్వం గురించి తెలియజేసే ఉద్దేశంలో భాగంగా దీనిని జరుపుకుంటారు. హిందూ హెరిటేజ్ మాసం ప్రారంభానికి గుర్తుగా పార్లమెంట్ వెలుపల జెండాను ఎగురవేశామని, 2022లో దీనిని ఎగురవేసినప్పుడు చెప్పిన విషయాన్నే మరోసారి ప్రస్తావిస్తున్నానని, ఇక్కడ హిందువుల శకం ప్రారంభమైందని తెలిపారు. కెనడాలో విద్యావంతులైన, విజయవంతమైన కమ్యూనిటీల్లో మనది ఒకటి అని పేర్కొన్నారు. ఇక్కడి సమాజం, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నామని తెలిపారు.