బిర్యానీ అంటే ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ఏ రెస్టారెంట్ లో చూసినా బిర్యాని ప్రియులు పక్కనే కూల్ డ్రింక్ కూడా పెట్టుకోవడం చూస్తుంటా. వేడివేడిగా చికెన్ బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే.. అబ్బా ఆ మజానే వేరు అని చాలా మంది ఆశ్వాదిస్తారు. బిర్యానీ లాగిస్తూ, కూల్ డ్రింక్ సిప్ చేస్తూ చిల్ అవుతుంటారు. నిజానికి కూల్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని తెలిసిందే. అందులోనూ బిర్యానీ తింటూ, కూల్ డ్రింక్ తాగడం మరింత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగితే కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. బిర్యానీలో మసాలాలు ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలవుతుంది. దానికి తోడు కూల్ డ్రింక్ తీసుకుంటే అందులోని యాసిడ్స్ జీర్ణ వ్యవస్థలో ఆమ్లాన్ని మరింత పెంచుతుంది. దీంతో ఇది గ్యాస్, గుండెలో మంట సమస్యకు దారి తీస్తుందని అంటున్నారు. మొదట్లో బాగానే అనిపించినా దీర్ఘకాలంలో మాత్రం తీవ్ర సమస్యలకు దారి తీస్తుంది.
కూల్ డ్రింక్‌లో ఉండే కార్బనేషన్ జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది అజీర్తి, పొట్టలో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది. అలాగే మధుమేహంతో బాధపడేవారికి ఇది మరింత ప్రమాదానికి కారణమవుతుంది. బిర్యానీలో ఉండే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు.. కూల్ డ్రింక్స్‌లో ఉండే అధిక చక్కెర స్థాయిలు రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
కూల్ డ్రింక్స్‌లో అధిక చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి లివర్‌తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అధికంగా ఉండే చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతాయి. అలాగే బిర్యానీలోని కొవ్వు ఒబేసిటీ, అధిక రక్తపోటుకు దారి తీస్తాయి. దీర్ఘకాలంలో ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటానికి దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.