దేవాలయ వ్యవస్థ ప్రమాదంలో పడింది.. భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు విలువలేకుండా పోయింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి..అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల మనోభావాలు, సమస్యలను అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయాల్లో భక్తులు సమర్పించే ముడుపులు అధికారులు, పాలక మండళ్ల ద్వారా దుర్వినియోగం అవుతున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. టీటీడీతో సహా ఇతర దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని, అందు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు.