sabarimala: కిటకిటలాడుతున్న శబరిమల

కార్తీకం రాగానే శబరిమల అయ్యప్ప భక్తులతో సందడి నెలకొంటుంది. మండల దీక్ష చేపట్టిన అయ్యప్ప దీక్షా స్వాములు వేలాదిగా స్వామిని దర్శించుకుని ఇరుముడి సమర్పించి దీక్ష విరమిస్తున్నారు. మండల మకరవిళక్కు సీజన్ ఆరంభం నుండి భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల తాకిడి రెట్టింపైంది.  

ఆలయం నవంబర్ 16న తెరుచుకోగా 6,12,290 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ వివరాలను ఆదివారం దేవస్థానం (ట్రావెన్‌కోర్ దేవస్వాం బోర్డు) అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మీడియాకు వెల్లడించారు. గత ఏడాది ఇదే వ్యవధిలో కేవలం 3,03,501 మంది మాత్రమే దర్శించుకున్నట్లు తెలిపారు. పోలీసుల ముందస్తు చర్యలతో ప్రస్తుతం నిమిషానికి 80 మంది భక్తులు ఆలయంలోకి పవిత్రమైన పడి మెట్లను ఎక్కగలుగుతున్నారని చెప్పారు. 

గత ఏడాది రూ.13.33 కోట్ల ఆదాయం రాగా, ఈసారి ఇప్పటి వరకు రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని తెలిపారు. వండి పెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో మూడు ఆన్ లైన్ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని, భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని పంబాలోని మనప్పరం ఆన్‌‌లైన్ కేంద్రం వద్ద విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్పారు. దర్శనం లేకుండా ఏ భక్తుడు కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ఇక పవిత్ర పంబా నదిలో దుస్తులు వదిలిపెట్టాలనేది ఆచారంలో భాగం కాదని ఆయన పేర్కొన్నారు. నదిని కలుషితం చేయవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు.