కార్తీక మాసం రాబోతోంది. అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని, అలా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుందని ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
అయ్యప్ప భక్తులు పరమపవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే కేరళ ప్రభుత్వం మరో ప్రకటన కూడా చేసింది. రోజుకు 80 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని కూడా నిర్ణయించింది. వర్చువల్ క్యూ బుకింగ్ విధానంలో భక్తులు తాము వచ్చే మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. అటవీమార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది.