Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో కీలక పరిణామం.. 2,500 మందికి వీఆర్‌ఎస్‌

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓవైపు కేంద్రం ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెబుతుంటే.. మరోవైపు వీఆర్‌ఎస్‌పై సర్వే జరుగుతుండటం ఆందోళనకు కారణమవుతోంది. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీన ప్రతిపాదన ఉండగానే .. తాజాగా ఉద్యోగుల వీఆర్ఎస్ పై యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయటం వివాదంగా మారింది. వీఆర్ఎస్‌ పేరుతో మరో పెద్దకుట్ర జరుగుతోందని కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. 2500 మందిని వీఆర్ఎస్‌ ద్వారా ఇంటికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

గత మూడేళ్ల నుంచి ఉత్పత్తి తగ్గించారని.. రెండేళ్లుగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నష్టాలు భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జరగాల్సిన రిక్రూట్‌మెంట్‌ జరగడం లేదని, పైగా వీఆర్ ఎస్ తో బలవంతంగా కార్మికులను బయటకు నెట్టే ప్రయత్నం చేయడం దారణమైన చర్య అంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఎస్ చర్యలను విరమింపచేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు.