Visakhapatnam: విజయవాడ – విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య విమాన ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విశాఖ – విజయవాడ మధ్య ఒక్క సర్వీసు మాత్రమే రాకపోకలు సాగిస్తుండటంతో సరిపోవడంలేదు. అందుకే  కొత్తగా రెండు విమాన సర్వీసులను అందుబాటులోకి వస్తున్నాయని విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి శనివారం  తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమాన సర్వీసులను ఈరోజు (ఆదివారం) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి   రామ్మోహన్‌నాయుడు  ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9గంటలకు విశాఖ చేరుతుంది. ఇక ఇండిగో సర్వీసు రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 8.20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి 9.50 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ – విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరినట్లు అవుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర రాజధాని అమరావతికి రాకపోకలు సాగించేందుకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.