అప్పపీడనం కారణంగా ఇప్పటికే ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉంది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష జరిపారు.
తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఫోన్‌లు, సందేశాల ద్వారా విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల యంత్రాంగాలను సంసిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అనిత చెప్పారు.
చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలలోని ప్రతి మండలంలో ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో కలిసి తుపాను ప్రభావ పరిస్థితులను డిజిటల్ విధానంలో పరిశీలించారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు తుపాను ప్రభావం తగ్గే వరకూ బయటికి వెళ్లవద్దని మంత్రి అనిత సూచించారు.