Srivaari Brahmotsavaalu: వైభవంగా శ్రీవారి మహారథోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి మహారథోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీవారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి‌, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాత్రి మలయప్పస్వామికి అశ్వ వాహనసేవ నిర్వహిస్తారు. అశ్వంపై కల్కి అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి అశ్వవాహనంతో వాహనసేవలు ముగియనున్నాయి.

రేపు చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రేపు మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఇప్పటికే చక్రస్నానం ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. పుష్కరిణిలో భక్తులకు ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది.