Rushikonda: రిషికొండపై చర్చ

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖలో రాజధాని ఏర్పాటులో భాగంగా రుషికొండపై నిర్మించిన భవనంపై శాసనసభలో మంగళవారం చర్చ చేపట్టనున్నారు. ఈ ప్యాలెస్ కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే దానిపై పలువురు సభ్యులు ఇప్పటికే సభలో ప్రశ్నలు అడిగారు. దీనికి తోడు సోమవారం సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. టిక్నో గృహాలపై శాసనసభలో నిర్వహించిన చర్చకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అలాగే రుషికొండ, ఇసుక, మద్యం విక్రయాల్లో జరిగిన కుంభకోణం పైన స్వల్ప కాలిక చర్చ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. 

రుషికొండ ప్యాలెస్ వ్యవహారం, సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో శాసనభలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అతిక్రమిస్తూ రుషికొండపై విలాసవంతమైన భవనాల అక్రమ నిర్మాణం, ప్రజా ధనం దుర్వినియోగంపై చర్చ జరగనుంది. అలాగే పోలవరం, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులపైనా చర్చకు అయ్యన్నపాత్రుడు అనుమతినిస్తూ మంగళవారం అజెండాలో వీటిని పొందుపర్చారు. 

అలాగే ఏపీ ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన మూడు వేర్వేరు బిల్లులను మంగళవారం ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణతో మరో బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు.