Pinipe Viswarup: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు అరెస్ట్?

మాజీ మంత్రి, వైసీపీ నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను  పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.  దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు  తెలుస్తోంది. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్ ను అరెస్ట్ చేసి, అక్కడి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్టు సమాచారం. ట్రాన్సిట్ వారెంట్ పై ఆయనను ఏపీకి తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీ ఎదుట హాజరుపరిచి విచారించనున్నారు. అనంతరం ఆయనను రిమాండ్ కు తరలిస్తారు.

కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం దుర్గాప్రసాద్ హత్య జరిగింది. కోనసీమ అల్లర్ల సమయంలో 2022 జూన్ 6న దుర్గాప్రసాద్ ను హత్య చేశారు. ఈ కేసులో శ్రీకాంత్ ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ హత్య కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేశ్ ను గత నెల 18న అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.  ఇప్పుడు శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.