సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ధ్వంసంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. విగ్రహ ధ్వంసం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహం కూల్చడం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహాపచారం అని అన్నారు. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూశానని ఆయన వాపోయారు. ఇటువంటి దుర్మార్గాలపై చాలా బలమైన చర్యలు అవసరమన్నారు.
అందుకే తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో చెప్పానని పవన్, ఇటువంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను విడుదల చేశారు.
సికింద్రబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. విగ్రహం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీసింది. హిందూత్వ సంఘాలు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంఘటనలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.