Manchu family : మంచు ఫ్యామిలీలో గొడవకి కారణమేమిటి?

ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. ఈ విషయంలో మంగళవారం మోహన్ బాబు ఓ మీడియా జర్నలిస్టుపై మైక్ తో దాడి చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది. అసలు గొడవేమిటి? ఎందుకు ఈ రచ్చ.

ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట.. శనివారమే మొదలైందని సమాచారం. ఆ పంచాయతీ సోమవారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంచు మనోజ్ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌‌ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఆ వెంటనే మంచు మోహన్ బాబు రాచకొండ కమిషనర్‌‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ తమని తాము సమర్థించుకుంటూ ప్రెస్‌నోట్‌లు కూడా రిలీజ్ చేశారు. కానీ.. అసలు గొడవకి కారణమేంటి? అనే విషయాన్ని మాత్రం మంచు ఫ్యామిలీలో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు.

వారి వాదనలు..

తాను ఆస్తులను అడగలేదని.. వాటిపై ఆధారపడకుండా తన ఫ్యామిలీని పోషించుకుంటున్నట్లు మనోజ్ చెప్పారు. అలానే మంచు విష్ణు తన స్వలాభం కోసం ఫ్యామిలీ ఆస్తిపాస్తులను వాడుకుంటున్నాడని.. కుటుంబంలో డబ్బులు కూడా వృథా చేస్తున్నాడంటూ ఆరోపించారు.

అయితే మోహన్‌బాబు మాత్రం తన కొడుకు మంచు మనోజ్, అతని భార్య మౌనిక నుంచి తనకి ప్రాణహాని ఉందంటూ ఆరోపించారు. తన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి మంచు మనోజ్ ప్రయత్నిస్తున్నారని.. ఆ ఇద్దరి నుంచి తనకి రక్షణ కల్పించాల్సిందిగా రాచకొండ సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు.

అసలు ఏం జరిగింది..

మంచు మోహన్‌బాబు ఇంట్లో  అసలు ఏం జరిగింది? అనే విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి ద్వారా మంగళవారం తెలిసింది. మోహన్ బాబు సార్ స్టాఫ్‌ ప్రసాద్‌తో మనోజ్‌ కు గొడవ జరిగింది. అతడ్ని కొట్టేందుకు మనోజ్ ప్రయత్నించగా.. తన స్టాఫ్‌ను అదుపులో పెట్టుకుంటాను కొటొద్దు అని మోహన్ బాబు చెప్పారు. అయితే మనోజ్ వినలేదు. దాంతో మోహన్ బాబు.. మనోజ్ మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మనోజ్ రెండో పెళ్లి టాపిక్‌ వచ్చింది. పెళ్లికి ముందే ఒక బాబు ఉన్న మౌనిక‌ను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లితో మనస్పర్థలు వచ్చాయి. ఈ గొడవ శనివారం జరిగింది. మోహన్ బాబు సార్ అంటే.. విష్ణుకు ప్రాణం. మోహన్ బాబు మనోజ్ చెయ్యి వేశాడు. డాడీనీ ముట్టుకుంటావా అంటూ మంచు విష్ణు రెచ్చిపోయినట్టు పనిమనిషి చెప్పుకొచ్చింది.

అయితే మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కొన్ని ప్రశ్నలకు తట్టుకోలేని మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై మైకుతో దాడికి దిగారు. దీంతో ఆయ‌న‌పై 118 బీఎన్ఎస్ సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేశారు. మ‌రోవైపు ఇప్ప‌టికే ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసిన రాచ‌కొండ పోలీసులు బుధవారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించారు. 

అయితే మంగ‌ళ‌వారం రాత్రి మోహ‌న్ బాబు ఆసుప‌త్రిలో చేరారు. రాత్రి జరిగిన తోపులాటలో ఆయ‌న‌ తలకు గాయమైందని, ట్రీట్ మెంట్ జరుగుతోందని ఆయన వర్గీయులు చెప్పారు. మోహన్ బాబు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్ద జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. ఈ ఘ‌ట‌న‌పై జ‌ర్న‌లిస్టు సంఘాల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

మొత్తానికి కుటుంబ తగాదాలు పబ్లిక్ లోకి వచ్చి రచ్చ చేసుకుంటున్నారని, అసలు వారి మధ్య వివాదానికి కారణం ఆస్తితగాదాలేనా? మరింకేమైనా ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది.